వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న విమర్శలు దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించమని వాలంటీర్లకు ఎవరు చెప్పారంటూ ఆయన నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు చోట్ల వాలంటీర్లను నిలదీస్తున్న ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఈ అంశంపై మరోసారి పవన్ ట్వీట్ చేశారు. మూడు ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు.

‘‘అందరి ఆందోళన ఒక్కటే.. మై డియర్ వాట్సన్! మీరు సీఎం అయినా, కాకపోయినా డేటా గోప్యత చట్టాలు అలాగే ఉంటాయి. కాబట్టి ఈ మూడు ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. 
1.వాలంటీర్ల బాస్‌ ఎవరు?2.ప్రజల వ్యక్తిగత డేటా సేకరించి ఎక్కడ భద్రపరుస్తున్నారు? 
3.వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు.. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే అధికారం వారికి ఎవరిచ్చారు?” 
అని జగన్‌ను పవన్‌ ప్రశ్నించారు. ‘‘వ్యక్తిగత సమాచారం ఎవరైనా ప్రైవేటు వ్యక్తి దగ్గర ఉంటే అది క్రైమ్’’ అంటూ గతంలో జగన్ చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియోను షేర్  చేశారు.