ఏపీ ముఖ్యమంత్రి జగన్, వైసీపీ నేతలపై టీడీపీ యువనేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. ఏపీని సర్వనాశనం చేశారని, అప్పుల ఊబిలోకి నెట్టేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని అన్నారు. ప్రజావేదిక కూల్చివేతతో పాలనను ప్రారంభించిన జగన్… తన అరాచక పాలనను కొనసాగిస్తున్నారని చెప్పారు. ఏ తప్పూ చేయని చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయించారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే చంద్రబాబు చేసిన తప్పా? అని ప్రశ్నించారు. చంద్రబాబు రాష్ట్రానికి అనేక పరిశ్రమలను తెచ్చారని… ఎంతో మంది యువతకు ఉపాధి కల్పించారలని… అదే ఆయన చేసిన నేరమా? అని అడిగారు. టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి టీడీపీ పోటీ చేయబోతోందని లోకేశ్ తెలిపారు. జనసేన శ్రేణులతో కలిసి టీడీపీ శ్రేణులు పోరాడాలని సూచించారు. జనసేనాని పవన్ కల్యాణ్ తో సమావేశమై… భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని చెప్పారు. చంద్రబాబుకు పంపించే ఆహారంలో వారి కుటుంబ సభ్యులే ఏదైనా కలపొచ్చంటూ వైసీపీ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. భోజనంలో విషం కలపడం, కోడికత్తి డ్రామాలు తమ కుటుంబ డీఎన్ఏలోనే లేవని చెప్పారు. విషం కలపడం, బాబాయ్ ని లేపేయడం వంటివి జగన్ డీఎన్ఏలో ఉన్నాయని అన్నారు.