కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అరాచకం రాజ్యమేలుతుందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కుటుంబం అక్రమంగా సంపాదించిన ప్రతి రూపాయి కక్కిస్తామని చెప్పారు. నాంపల్లి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణలో అవినీతి బీఆర్ఎస్ పాలనను అంతం చేద్దామని పిలుపునిచ్చారు. దీపావళి తర్వాత తాము ప్రచారాన్ని ముమ్మరం చేస్తామన్నారు. పండుగ తర్వాతే ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటిస్తామని చెప్పారు. బీజేపీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారన్నారు.

మజ్లిస్, బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెబుతున్నారని, కానీ తాము ఎప్పటికీ మజ్లిస్ పార్టీతో కలిసేది లేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ పార్టీపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మజ్లిస్ పార్టీతో కలిసి లాభపడిందే కాంగ్రెస్ అన్నారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం ఐదు నెలల్లోనే కర్ణాటకను భ్రష్టు పట్టించిందన్నారు.