లోక్ సభ ఎన్నికల బరిలో ఏపీ నుంచి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల నిలబడనున్నారు. ముఖ్యమంత్రి జగన్ ను ఇరకాటంలోకి నెట్టేందుకు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు ఈ ఆలోచన చేసినట్లు సమాచారం. ఏఐసీసీ వర్గాలు ఈమేరకు షర్మిలపై ఒత్తిడి తెచ్చాయని తెలుస్తోంది. జగన్ ను ఆయన సొంత ఇలాఖాలోనే దెబ్బ కొట్టాలని, అందుకు షర్మిలను పోటీలో నిలబెట్టడమే మార్గమని పలువురు నేతలు అభిప్రాయపడ్డారట. ఏఐసీసీ నేతల ఒత్తిడి నేపథ్యంలో కడప ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు షర్మిల అంగీకరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీనిపై ఒకటి రెండు రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

మంగళవారం కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ మీటింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ మీటింగ్ తర్వాత ఏపీ, తెలంగాణ నుంచి లోక్ సభ బరిలో నిలిచే పార్టీ అభ్యర్థుల పేర్లపై స్పష్టత వస్తుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 25న లోక్ సభ అభ్యర్థుల జాబితాను ఏపీసీసీ విడుదల చేయనుందని, అందులో తొలి పేరు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలదేనని చెప్పాయి. కాగా, కడప నుంచి వైసీపీ అభ్యర్థిగా వైఎస్ అవినాశ్ రెడ్డికి జగన్ టికెట్ ఇచ్చారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాశ్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణలు అవినాశ్ రెడ్డిపై వ్యతిరేకత పెంచి ఓటర్లు కాంగ్రెస్ ను ఆదరిస్తారని హైకమాండ్ భావిస్తోందని సమాచారం. మరోవైపు, వైఎస్ షర్మిల వైజాగ్ నుంచి లోక్ సభకు పోటీ చేస్తారని ఇటీవల ప్రచారం జరిగింది. తాజాగా ఆమె కడప ఎన్నికల బరిలో నిలుస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో ఈ విషయంపై కాంగ్రెస్ స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.