తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఢిల్లీ గడ్డ పై కూడా సంచలనం సృష్టిస్తోంది ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు.. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న ఆమెను ఈ నెల 15న ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే . ఆ మరుసటి రోజు ఆమెను వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గత శనివారం మళ్లీ కోర్టులో ప్రవేశ పెట్టిన ఈడీ అధికారులు కవిత కస్టడీని పొడిగించాలని కోరారు. దీంతో, ఆమె కస్టడీని కోర్టు మరో 3 రోజులు పొడిగించింది. ఈ క్రమంలో మొత్తం 10 రోజుల పాటు కవితను ఈడీ అధికారులు ప్రశ్నించారు. కవిత కస్టడీ సోమవారంతో ముగిసింది. దీంతో, ఈ ఉదయం 11 గంటల సమయంలో కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు. కవితను మరికొన్ని రోజుల పాటు కస్టడీకి ఈడీ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది . మరోవైపు, కవిత బెయిల్ పిటిషన్ పై కూడా కోర్టులో వాదనలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కోర్టు ఆమెను మళ్లీ ఈడీ కస్టడీకి ఇస్తుందా.. ? లేక జ్యుడీషియల్ కస్టడీ విధిస్తుందా.. ? లేక బెయిల్ మంజూరు చేస్తుందా.. ? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, ఈడీ కస్టడీలో ఉన్న కవిత విచారణ సోమవారం రాత్రి ముగిసింది. అనంతరం.. ఆమె భర్త అనిల్, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, పీఏ శరత్, న్యాయవాది మోహిత్ రావు కలిశారు. దాదాపు గంట సేపు కవితతో వీరు మాట్లాడినట్టు సమాచారం . కవిత యోగక్షేమాలను తెలుసుకున్న భర్త అనిల్… ఆమెకు ధైర్యం చెప్పినట్టు తెలుస్తోంది.