తాము ఓడిపోయినంత మాత్రాన ప్రజలను వదిలేసేది లేదని… వారి పక్షాన పోరాడతామని… ప్రజలే తమకు దేవుళ్లని బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం జీడిపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ లేకుండా తెలంగాణ లేదని… తెలంగాణ నుంచి కేసీఆర్‌ను ఎవరూ వేరు చేయలేరని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి… చావునోట్లో తల పెట్టి తెలంగాణను సాధించారన్నారు.తెలంగాణ రావడం వల్లే మనకు నీళ్లు… నిధులు.. నియామకాలు వచ్చాయన్నారు. మన గ్రామాలను మనం అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు. తెలంగాణ రావడం వల్లే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలు వచ్చాయన్నారు. వీటన్నింటికి కారణం కేసీఆర్ అని గుర్తుంచుకోవాలన్నారు. అయితే ప్రజాతీర్పును అంగీకరిస్తూ బీఆర్ఎస్ పార్టీకి వేసిన ప్రతి ఓటు కోసం కృతజ్ఞతతో పని చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ అబద్ధాలు చెప్పి ఎన్నికల్లో గెలిచిందని ఆరోపించారు