ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంట్రీతో పిఠాపురం రాత మారిపోయినట్లు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ పోటీచేస్తున్నారనగానే రాష్ట్రవ్యాప్తంగా పిఠాపురం పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత ఎన్నికల సమయంలో వీఐపీల తాకిడి, ప్రచారంతో ఎప్పుడూ వార్తల్లో నానుతూనే ఉంది పిఠాపురం.ఇక పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గ్రాండ్ విక్టరీ కొట్టడంతో ఎన్నికల ఫలితాల సమయంలో పిఠాపురం మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన పనితో పిఠాపురంలో రియల్ ఎస్టేట్ భూమ్ పెరిగిందని స్థానికులు చెప్తున్నారు.ఇటీవల కాకినాడ జిల్లా పర్యటనకు వెళ్లిన పవన్ కళ్యాణ్ పిఠాపురంలోని భోగాపురం, ఇల్లింద్రాడ పరిధిలో 3.52 ఎకరాలు కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.ఇక పవన్ కళ్యాణ్ ప్రకటన తర్వాత పిఠాపురంలో ఒక్కసారిగా భూముల ధరలు పెరిగిపోయినట్లు చెప్తున్నారు. గతంలో ఈ ప్రాంతంలో ఎకరా భూమి 15 నుంచి 16 లక్షలు పలికేదని సమాచారం అలాగే జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న భూములు అయితే ఎకరా 50 లక్షల వరకూ పలికేదని స్థానికులు చెప్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భూములు కొనుగోలు చేసిన తర్వాత ఎకరా భూమి కోటి రూపాయలు పలుకుతున్నట్లు టాక్. హైవేకు ఆనుకుని ఉన్న భూములు అయితే ఒక్కోచోట రూ.3 కోట్ల వరకూ పలుకుతున్నట్లు సమాచారం.