అక్కినేని నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘తండేల్’. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మాతగా తెరకెక్కుతోంది. ఇందులో నాగచైతన్య ‘తండేల్’ రాజు అనే మత్స్యకారుడి పాత్ర పోషిస్తున్నారు. 

తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఎసెన్స్ ఆఫ్ తండేల్’ పేరిట అదిరిపోయే గ్లింప్స్ వీడియో రిలీజైంది. “ఈపాలి యేట… గురి తప్పేదేలేదేస్… ఇక రాజులమ్మ జాతరే” అంటూ సముద్రంలో వల విసురుతూ నాగచైతన్య చెప్పే డైలాగ్ తో గ్లింప్స్ ఆరంభమవుతుంది. ఈ గ్లింప్స్ ద్వారా ‘తండేల్’ చిత్రకథను దర్శకుడు చూఛాయగా చెప్పేసినట్టు అర్థమవుతుంది.

సముద్ర జలాల్లో వేటకెళ్లే మత్స్యకారులను పాకిస్థాన్ సైన్యం పట్టుకుని వారిని ఏళ్ల తరబడి జైళ్లలోనే ఉంచేయడం తెలిసిందే. ‘తండేల్’ చిత్రంలోనూ నాగచైతన్య, తదితరులు పాక్ సైన్యానికి చిక్కడం చూపించారు.