తమ పార్టీ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలు దాడులు చేస్తున్నారని… వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీ రవిగుప్తాకు బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ నేతల బృందం డీజీపీని కలిసింది. రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ నేతలపై దాడులు చేస్తున్నారని వారు వివరించారు. హుజూర్‌నగర్, మానకొండూర్, భూపాలపల్లి, కొల్లాపూర్ నియోజకవర్గాలలో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు జరిగాయని డీజీపీకి ఫిర్యాదు చేశారు. నిన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో భువనగిరి జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులు దాడి జరిపినట్లు చెప్పారు.

నిష్పక్షపాతంగా ఉండాల్సిన పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని… ఈ చర్యను తక్షణమే అడ్డుకోవాలని కోరారు. పోలీసులు అధికార పార్టీ నేతలకు వత్తాసు పలకకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, భాస్కర రావు, కోరుకంటి చందర్, భువనగిరి జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి తదితరులు డీజీపీని కలిశారు.