కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ తొలగింపు విషయంలో ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్పించుకున్నారు. ఫుడ్ స్టాల్ ను తొలగించవద్దంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు ఎక్కడైతే ఆమె వ్యాపారం చేసుకుందో ఇకపైనా అదే స్థలంలో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కొనసాగించుకునేలా చూడాలని స్పష్టం చేశారు. అక్కడ ట్రాఫిక్ రద్దీని క్రమబద్దీకరించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈమేరకు సీఎం రేవంత్ రెడ్డి సీపీఆర్వో అయోధ్య రెడ్డి బుధవారం ట్వీట్ చేశారు. ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగుతోందనే కారణంగా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ను పోలీసులు మూసివేసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో విపరీతంగా పాపులారిటీ సంపాదించుకున్న కుమారి ఆంటీ.. అదే పాపులారిటీ కారణంగా ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసుల నిర్ణయాన్ని తప్పుబడుతూ, కుమారి ఆంటీకి మద్దతుగా నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. విషయం ముఖ్యమంత్రి కార్యాలయం దాకా చేరడంతో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం స్పందించారు.