తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పయనమయ్యారు. శ‌నివారం నాడు ఢిల్లీలో జ‌ర‌గ‌బోయే కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ క‌మిటీ స‌మావేశంలో ఆయన పాల్గొన‌నున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు ప‌లువురు ఎంపీలు కూడా ఢిల్లీకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ‌లో 8 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందిన విషయం తెలిసిందే . ఈ క్రమంలో రేవంత్ ఢిల్లీ టూర్ పై ప్రాధాన్యత ఏర్పడింది . కాగా కాంగ్రెస్ అధిష్ఠానంతో కొత్త టీపీసీసీ అధ్యక్షుడి నియామకంతో పాటు, మంత్రి వర్గ విస్తరణ చేయాల్సి ఉంది . అంతేకాకుండా రాష్ట్రంలోని నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని శ్రేణులు భావిస్తున్నారు. కాగా.. లోక్ సభ ఎన్నికలు కాగానే.. కొత్త టీపీసీసీ అధ్యక్షున్ని నియమిస్తామని కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తుండటం.. లోక్ సభ ఎన్నికల్లోనూ మంచి రిజల్టే రావటంతో కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు శ్రేణులు భావిస్తున్నారు. మరోవైపు.. మొన్న వెలువడిన లోక్ సభ ఎన్నికల్లో పెద్దప‌ల్లి నుంచి గ‌డ్డం వంశీకృష్ణ, జ‌హీరాబాద్ నుంచి సురేశ్ కుమార్ షెట్కార్, నాగ‌ర్‌క‌ర్నూల్ నుంచి మ‌ల్లు ర‌వి, న‌ల్గొండ నుంచి కుందూరు ర‌ఘువీర్, భువ‌న‌గిరి నుంచి చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి, వ‌రంగ‌ల్ నుంచి క‌డియం కావ్య, మ‌హ‌బూబాబాద్ నుంచి బ‌ల‌రాం నాయ‌క్, ఖ‌మ్మం నుంచి ర‌ఘురాం రెడ్డి గెలుపొందారు