దేశంలోని చారిత్రాత్మక ఆధ్యాత్మిక నగరం అయోధ్య ఒక ప్రత్యేకమైన శోభతో మెరిసిపోతోంది. అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యంలో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. నగరం మొత్తం దేశం నలు మూలల నుంచి వచ్చిన భక్తులతో నిండిపోయింది. దేశంలోని ప్రముఖులు, సెలబ్రిటీలు అందరూ అయోధ్యలోనే ఉన్నారా? అనే పరిస్థితి అక్కడ ఉంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ, తనయుడు రామ్ చరణ్ అయోధ్యకు చేరుకున్నారు. అయోధ్య ఎయిర్ పోర్టులో కార్యక్రమ నిర్వాహకులు వారికి స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి వారు భద్రత మధ్య తమకు బస ఏర్పాటు చేసిన ప్రాంతానికి బయల్దేరారు. ఎయిర్ పోర్టులో చిరంజీవి మాట్లాడుతూ… అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుకల్లో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని చెప్పారు. తాను ఎంతో భక్తితో కొలిచే హనుమంతుడే తనకు ఆహ్వానం పంపినట్టుగా ఉందని అన్నారు.