Home Telangana బీజేపీలో కోవర్టులు? పక్క పార్టీ వైపు చూస్తున్న నేతలు ..

బీజేపీలో కోవర్టులు? పక్క పార్టీ వైపు చూస్తున్న నేతలు ..

తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. బహిరంగ తిట్టుకోవడానికి కూతవేటు దూరంలోనే నేతలు ఉంటున్నారు. ఇప్పటికే ఇన్‌డైరెక్ట్‌గా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత అసలే పార్టీ సమస్యల్లో ఉంటే ఇప్పుడు నేతల మధ్య విభేదాలు పుండు మీద కారం చల్లినట్టు ఉంటోంది.కర్ణాటక ఎన్నికల తర్వాత ఒక్కసారిగా పార్టీ నేతల ప్రవర్తనలో మార్పు వచ్చింది. ముఖ్యంగా వేరే పార్టీల నుంచి చేరిన వారు పక్కచూపులు చూస్తున్నారనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. మరికొందరు ఆపార్టీలో చేరుదామా అన్ని కొన్ని రోజులుగా ఆలోచించిన వాళ్లు ఇప్పుడు బీజేపీ వైపు చూడటానికే ఇష్టం పడటం లేదు. ఆ పార్టీలో ఉన్న వారిని ఎలా బయటకు లాగుదామా అని ఆలోచిస్తున్నారట.
ఉన్న వాళ్లు బయటకు రావడానికైనా… వేరే పార్టీ వాళ్లు బీజేపీలోకి వెళ్లకపోవడానికైనా చెప్పే ఒకే ఒక కారణం కోవర్ట్. అదే కేసీఆర్‌ మనుషులు బీజేపీలో ఉన్నారని అక్కడ జరిగే పరిణామాలు, చేరికలు, ఇతర సమాచారాన్ని బీఆర్‌ఎస్‌కు ఉప్పు అందిస్తున్నారని ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నమాట. తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్‌ అంటూ ఇతర పార్టీ నేతలకు గాలం వేసేందుక ఏర్పాటు చేసిన చేరికల కమిటీ చైర్మెన్ ఈటెల సైతం విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల పొంగులేటి, జూపల్లి వంటి కీలకనేతలను బిజేపిలోకి లాగేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అంతే కాదు వారిని ఆహ్వానించడానికి వెళ్లిన ఈటెలను, నువ్వే కాంగ్రెస్‌లోకి వచ్చేయమంటూ ఒప్పించే ప్రయత్నం చేసారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఇలా తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తామంటూ ఏర్పడ్డ బీజేపీ వలసల కమిటి పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. దీనికి తోడు కీలక నేతల మధ్య అంతర్గత విభేదాలు పచ్చగడ్డి వెయ్యకున్నా భగ్గుమంటూనే ఉన్నాయి. ఈటెలకు వ్యతిరేకంగా బండి టీమ్ పని చేస్తుందనే విమర్శలు ఓవైపు. పార్టీలో ఉండాలా పొంగులేటి చెప్పినట్లు గోడ దూకేద్దామా అనే సందేహం ఈటెల ఉన్నట్లు తెలుస్తోంది. కొండా విశ్వేశ్వరరెడ్డి సైతం బీజేపితో అంటిముట్టనట్లు వ్యవహరించడం అనేక సందేహలు వ్యక్తమవుతున్నాయి. ఏదోరోజు ఆయన జారుకుంటారా అనే వార్తులు చక్కర్లు కొడుతున్నాయి.