రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరిగిన వరుస దుర్ఘటనలపై  ట్విటర్‌లో ఓ వీడియోను విడుదల చేశారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, బలహీనవర్గాల ప్రజలపై జరుగుతున్న దాడుల గురించి ప్రశ్నిస్తూ ‘ఇది రాష్ట్రమా..? రావణ కాష్ఠమా?’ అంటూ వీడియో విడుదల చేశారు. నాలుగేళ్ల నరకం అంటూ ఇప్పటి వరకు జరిగిన సంఘటనలను ఇందులో ఉదహరించారు.పదో తరగతి విద్యార్థి సజీవదహనం, ఏలూరు యాసిడ్‌ దాడిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడలేదని చంద్రబాబు మండిపడ్డారు. నెల్లూరు, మచిలీపట్నం అత్యాచార ఘటనలపైనా నోరు మెదపలేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని శాంతిభద్రతలపై కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదని దుయ్యబట్టారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నిజంగా ప్రజల బిడ్డే అయితే.. దాడులు చేసిన సొంత పార్టీ నేతల్ని కాపాడతారా? అని ప్రశ్నించారు. ప్రజల బిడ్డే అయితే.. పేదల ప్రాణాలకు వెలకట్టే పెత్తందారు అయ్యేవారా? అని నిలదీశారు.