ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈరోజు టీడీపీ అభ్యర్థుల మూడో జాబితాను ఆ పార్టీ అధినేత చంద్రబాబు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో 13 మంది ఎంపీ అభ్యర్థులు, 11 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. ఆసక్తికర విషయం ఏమిటంటే తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధికి చంద్రబాబు ఏపీలో ఎంపీ టికెట్ ఇచ్చారు. బాపట్ల ఎంపీ అభ్యర్థిగా మాజీ డీజీపీ కృష్ణప్రసాద్ ను ప్రకటించారు. 

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ ను కృష్ణప్రసాద్ ఆశించారు. అయితే, ఆయనకు టికెట్ దక్కలేదు. తాజాగా లోక్ సభ ఎన్నికలకు సంబంధించి వరంగల్ బీజేపీ ఎంపీ టికెట్ ను ఆయన ఆశించారు. చివరకు ఏపీలో బాపట్ల లోక్ సభ స్థానం నుంచి కృష్ణప్రసాద్ టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు.