తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. 23 ఏళ్ల క్రితం ఉపిరి పోసుకున్న ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. దేశవ్యాప్తంగా విస్తరించాలని ఉద్దేశ్యంతో ప్రస్తుత బీఆర్ఎస్‌ పార్టీ గా అవతరించింది. రాజకీయాలే పరమావధిగా అవిర్భవించిన పార్టీ చరిత్రలో తొలిసారిగా పార్టీ వ్యవస్థాపకులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబం లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉంటోంది. 2004 నుండి ప్రతి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అతని కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు పోటీ చేస్తూనే ఉన్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుమారుడు కేటీ రామారావు, కేసీఆర్ మేనల్లుడు టి.హరీష్ రావుల్లో ఎవరో ఒకరు ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని ఊహాగానాలు వచ్చాయి. అయితే ఆ ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా ఎన్నికల బరిలోకి దిగట్లేదు . గతంలో ఎంపీగా గెలిచిన కవిత లిక్కర్ స్కామ్ కేసుతో ఈసారి ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 2019లో నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం ఎన్నికల్లో ఓడిపోయిన కవిత అరెస్ట్ వల్ల ఈసారి పోటీ చేసే అవకాశం లేదు . తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యురాలిగా ఉన్న ఆమెను ఇటీవల ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్‌లో ఈడీ అరెస్టు చేసి తీహార్ జైలుకు పంపించింది. ఈఅయితే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో 17 స్థానాలకు బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ఖరారు చేసింది . 2001లో తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారు . కేసీఆర్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి 2004లో కరీంనగర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు . అదే సంవత్సరం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి అయ్యారు. 2006, 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన అదే స్థానాన్ని నిలబెట్టుకున్నారు.2009లో కేసీఆర్ మహబూబ్‌నగర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈ సమయంలోనే తెలంగాణ రాష్ట్ర లక్ష్యాన్ని సాధించడంలో విజయం సాధించారు తెలంగాణలో టీఆర్ఎస్ తొలి ప్రభుత్వాన్ని 2014లో ఏర్పాటు చేసిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. అసెంబ్లీకి ఎన్నికైన ఆయన కుమారుడు కేటీఆర్ , మేనల్లుడు హరీష్ రావు కేబినెట్‌లో మంత్రులు అయ్యారు. అప్పుడే జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో కేసీఆర్ కూతురు కవిత నిజామాబాద్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. 2018లో టీఆర్‌ఎస్‌ అధికారాన్ని నిలబెట్టుకోగా, 2019 ఎన్నికల్లో నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌ చేతిలో కవిత ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె శాసనమండలికి ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ చేతిలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఓడిపోయి అధికారాన్ని కోల్పోయింది.