ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు దైవభక్తి చాలా ఎక్కువ. ఇటీవల ఆయన చేపట్టిన వారాహి దీక్ష ముగిసింది. 11 రోజుల పాటు ఆయన ఈ దీక్షను చేపట్టారు. సమాజ సంక్షేమం, దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ ఆయన చేపట్టిన దీక్ష… వారాహి అమ్మవారి ఆరాధన, కలశోద్వాసన క్రతువుతో ముగిసింది. దీక్ష ముగింపు సందర్భంగా అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏక హారతి, నక్షత్ర హారతులను అమ్మవారికి సమర్పించారు. వేద పండితులు బ్రహ్మశ్రీ సుధీర్ శర్మ, వేణుగోపాల శర్మ, హరనాథ్ శర్మ పూజా క్రతువును పూర్తి చేసి, పవన్ కు ఆశీర్వచనాలు అందజేశారు. మరోవైపు… త్వరలోనే పవన్ కల్యాణ్ చాతుర్మాస దీక్షను చేపట్టబోతున్నారు. గత రెండు దశాబ్దాలుగా ఆయన ఈ దీక్షను చేపడుతున్నారు. ఈ దీక్ష ఆషాడం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజ మాసాలు కలిపి… నాలుగు నెలల పాటు కొనసాగుతుంది. గృహస్తాచార రీతిలో ఈ దీక్షను పవన్ చేపట్టనున్నారు. అధికారిక కార్యకలాపాల్లో పాల్గొంటూనే… శుభ తిథుల సమయంలో దీక్షా వస్త్రాలను ఆయన ధరిస్తారు.