bandi sanjay
bandi sanjay

తెలంగాణ బీజేపీ నేతల మధ్య విభేదాలు కొనసాగుతన్నాయనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతున్న సంగతి తెలిసిందే. పరిస్థితిని చక్కదిద్దేందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను మార్చాలనే యోచనలో పార్టీ హైకమాండ్ ఉందని… ఆయన స్థానంలో డీకే అరుణ లేదా ఈటల రాజేందర్ కు బాధ్యతలను కట్టబెట్టే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్ స్పందస్తూ… ఇదంతా తప్పుడు ప్రచారమేనని అన్నారు. 

తెలంగాణలో రోజురోజుకు బీజేపీ బలపడుతోంది… దీంతో పార్టీని బలహీనపరచాలనే ఉద్దేశంతో నాయకుల మధ్య విభేదాలు, పార్టీ అధ్యక్షుడి మార్పు అంటూ ప్రత్యర్థి పార్టీలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని తరుణ్ చుగ్ అన్నారు. తమ పార్టీ నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, అందరూ ఐకమత్యంలో పార్టీ గెలుపు కోసం ముందుకు సాగుతున్నారని చెప్పారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే ప్రతి ఒక్క నాయకుడి ఏకైక లక్ష్యమని అన్నారు. ఈ లక్ష్యం కోసమే అధ్యక్షుడి దగ్గర నుంచి సామాన్య కార్యకర్త వరకు పని చేస్తున్నారని చెప్పారు.