మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యవహారంలో సీఐడీ దర్యాప్తు ముమ్మరమైన నేపథ్యంలో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. మార్గదర్శిలో తనిఖీలు నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సూచించింది. తాము మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే వరకు మార్గదర్శి వ్యవహారానికి సంబంధించి తనిఖీలు, అరెస్టులు చేయరాదని పేర్కొంది. ఒకట్రెండు రోజుల్లో తాము మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది. గత కొన్ని రోజులుగా ఏపీ సీఐడీ అధికారులు మార్గదర్శి బ్రాంచిల్లో వరుసగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా, మార్గదర్శికి సంబంధించి ఇప్పటివరకు మూడు కేసులు నమోదైనట్టు సీఐడీ చీఫ్ ఎన్.సంజయ్ తెలిపారు. పలువురు మార్గదర్శి బ్రాంచి మేనేజర్లను అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. మున్ముందు మరిన్ని కేసులు నమోదవుతాయని పేర్కొన్నారు.