రాష్ట్రంలో పేదవారు పేదలుగానే మిగిలిపోతుండగా ధనికులు మాత్రం మరింత ధనవంతులుగా మారుతున్నారని ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. పేదలను ధనవంతులుగా మార్చడమే టీడీపీ లక్ష్యమని ప్రకటించారు. ఇందుకోసం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించారు. ఈమేరకు శుక్రవారం నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘మహిళలతో ప్రజావేదిక’ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. పేదవారికి ఆర్థికంగా చేయూతనిచ్చి పైకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చంద్రబాబు చెప్పారు. ఇందుకోసం ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో కొత్త కార్యక్రమం చేపడతామని ఆయన వివరించారు. ప్రజల ద్వారా సంపద సృష్టించి పేదలను ధనికులను చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. డబ్బులు, భూములు కాదు.. రాష్ట్ర ప్రజలే తన ఆస్తి అని, ప్రజలకు కష్టం కలగకుండా చూసుకుంటానని చెప్పారు. భవిష్యత్తులో ప్రజలకు కరెంటు కష్టాలను తీరుస్తానని, చార్జీలు పెంచడం కాకుండా ప్రత్యామ్నాయంగా సౌర, పవన విద్యుత్తును ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చంద్రబాబు వివరించారు.