ప్రముఖ తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు కొన్నిరోజుల కిందటే వైసీపీలో చేరి, పది రోజులు గడవకముందే ఆ పార్టీకి రాజీనామా చేయడం ఓ సంచలనం! వైసీపీ తీరు నచ్చకే రాయుడు రాజీనామా చేశాడంటూ ఆ పరిణామాన్ని విపక్షాలు చక్కగా ఉపయోగించుకున్నాయి. 

రాయుడు తాను దుబాయ్ లో జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్ లో పాల్గొంటున్నానని, ఆ లీగ్ లో పాల్గొనేవాళ్లు రాజకీయాల్లో ఉండకూడదన్న నిబంధన ఉందని, అందుకే రాజీనామా చేయాల్సి వచ్చిందన్న కోణంలో ఓ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ను పట్టుకుని వైసీపీ తన ప్రత్యర్థి పార్టీలపై ఎదురుదాడికి దిగింది. ఇప్పుడేమంటారు అంటూ టీడీపీ, జనసేన నేతలను ప్రశ్నించింది. 

ఇప్పుడు ఆ వ్యవహారం మరో మలుపు తిరిగింది. సంచలనం అంటే ఇదీ అని నిరూపించేలా అంబటి రాయుడు ఇవాళ జనసేనాని పవన్ కల్యాణ్ ను కలిశారు. అసలిది ఎవరూ ఊహించని పరిణామం! 

ఇటీవల తన ట్వీట్ లో… తాను కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటానని రాయుడు పేర్కొనడంతో, రాజకీయాల్లో ఇడమలేక విసిగిపోయి ఉంటాడని అందరూ భావించారు. కానీ, నేడు పవన్ కల్యాణ్ ను కలిసిన నేపథ్యంలో, రాయుడి మదిలో ఆలోచనలు మరోలా ఉన్నాయన్న విషయం అర్థమవుతోంది.