హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి ఏర్పాట్లు ఊపందుకున్నాయి. మరోవైపు, కాబోయే దంపతులకు ఇతర కుటుంబసభ్యులు వరుసగా ప్రీవెడ్డింగ్ పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి కాబోయే దంపతుల కోసం ఓ పార్టీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా అల్లు అర్జున్ దంపతులు కూడా వరుణ్, లావణ్య కోసం మరో ప్రీవెడ్డింగ్ పార్టీ ఇచ్చారు. అల్లు అర్జున్ ఇంట్లో ఆదివారం జరిగిన ఈ పార్టీలో మెగా-అల్లు కుటుంబసభ్యులతో పాటూ హీరో నితిన్, ఆయన భార్య షాలిని, నటి రీతూ వర్మ కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించి కొన్ని ఫొటోలను వరుణ్ తేజ్ నెట్టింట అభిమానులతో పంచుకున్నారు. పార్టీ అద్భుతమైన అనుభూతిని మిగిల్చిందంటూ కామెంట్ చేశారు. ‘థాంక్యూ బన్నీ, స్నేహ అక్కా’ అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. జూన్‌లో వరుణ్, లావణ్యల నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. నవంబర్ 1న ఈ ప్రేమజంట వివాహ బంధంతో ఒక్కటికానుంది. ఇటలీలోని టస్కానీలో వివాహం జరిపించేందుకు మెగా కుటుంబం ఏర్పాట్లు చేస్తోంది.