టాలీవుడ్ లో తన మార్క్ కామెడీ తో అల్లరి నరేష్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. . ఒకప్పుడు కామెడీ చిత్రాలకు, కామెడీని పండించే హీరోల్లో టాప్ ప్లేస్‌లో ఉండేవాడు. అయితే కొంచం కామెడీ మూవీస్ కి గ్యాప్ తీసుకుని సీరియస్ పాత్రలు చేసి అల్లరి నరేష్ కామెడీనే కాదు సీరియస్ పాత్రలు కూడా చేయగలడని నిరూపించుకున్నాడు. ఇంకా మళ్లీ ఇప్పుడు ఆ ఒక్కటీ అడక్కు అనే సినిమాతో నవ్వించేందుకు మే 3న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా కలిసి చేసిన ఈ మూవీ కథ విషయానికి వస్తే గణపతి అలియాస్ గణ ప్రభుత్వ ఉద్యోగి అయినా కానీ పెళ్లి కాదు. అప్పటికే యాభై సంబంధాలు వచ్చి పోతాయి. వయసు మీద పడినా ఇంకా గణకు పెళ్లి కావడం లేదని ఇరుగు పొరుగు గుసగుసలాడుకుంటూనే ఉంటారు. గణ తమ్ముడికి పెళ్లై ఓ కూతురు కూడా ఉంటుంది. గణకి పెళ్లి కావడం లేదని తల్లి కూడా మనస్తాపానికి గురవుతుంటుంది. ఎలాగైనా ఓ అమ్మాయిని వెతకాలి అని హ్యాపీ మ్యాట్రిమోనీలో జాయిన్ అవుతాడు. అక్కడ అంతకు ముందు కలిసిన సిద్ది ప్రొఫైల్ చూసి కనెక్ట్ అవుతాడు. అలా గణ, సిద్దిల మధ్య పరిచయం మొదలవుతుంది. కానీ గణకి సిద్ది నో చెబుతుంది. ఆ తరువాత గణ ఏం చేస్తాడు? అసలు సిద్ది ఎందుకు నో చెబుతుంది? హ్యాపీ మ్యాట్రిమోనీ చేసే మోసాలు ఏంటి? చివరకు గణకు పెళ్లి అవుతుందా? అన్నది థియేటర్లో చూడాల్సిందే. పెళ్లి అనేది ప్రస్తుతం సమాజంలో చాలా మంది ఎదుర్కొంటోన్న సమస్య. వయసు మీద పడినా పెళ్లిళ్లు జరగడం లేదు. వయసు దాటి పోతోన్నా బిడ్డలకు పెళ్లిళ్లు జరగడం లేదని తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ముప్పై దాటితే గానీ పెళ్లి ఊసు ఎత్తడం లేదు. మారిన జీవన శైలి, లేదా సెటిల్ అవ్వాలనే కోరిక ఇలా ఎన్నో కారణాల వల్ల లేటు వయసులోనే పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం అందరూ పెళ్లి అనే కాన్సెప్ట్‌కు కనెక్ట్ అవుతారనేఉద్దేశ్యంతోనే ఆ పాయింట్‌తోనే ఆ ఒక్కటీ అడక్కు అనే మూవీని తీశారు. పెళ్లి పేరుతో మ్యాట్రిమోనీ సైట్లు చేసే దందాలు, మోసాలు, అక్కడ జరిగే అక్రమాలను టచ్ చేశారు. ఈ మూవీకి అదే మెయిన్ పాయింట్. మ్యాట్రిమోనీ సైట్ల ద్వారా జరిగే వ్యాపారాన్ని టార్గెట్ చేశాడు దర్శకుడు. చిన్న చిన్న లోపాలు పక్కన పెడితే ఆ ఒక్కటీ అడక్కు సినిమాను ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని చూసేలానే ఉంటుంది. ఎక్కడా కూడా వల్గర్ సీన్లను, అశ్లీలతను పెట్టలేదు. సాంకేతికంగా ఈ చిత్రం ఓకే అనిపిస్తుంది. గోపీ సుందర్ పాటలు, ఆర్ఆర్ అంతగా గుర్తుండదు. కెమెరామెన్ ఇచ్చిన విజువల్స్ ఓకే అనిపిస్తాయి. ఎడిటింగ్, ఆర్ట్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ అన్నీ కూడా బాగున్నాయి.