ఏపీలో ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఐతే ఈ సారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షించింది. అక్కడ కూడా ఈ ఎన్నికల్లో భారీగా ఓటింగ్ నమోదైంది. ఇక అసలు విషయానికి వస్తే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో పవన్‌ను కచ్చితంగా ఓడిస్తానని కాపు ఉద్యమ నేత, వైఎస్సార్‌సీపీ లీడర్ ముద్రగడ పద్మనాభం సవాల్ చేశారు. ఒకవేళ పవన్‌ను ఓడించకపోతే తన పేరును మార్చుకుంటానని ఛాలెంజ్ విసిరారు . అయితే ఈ ఎన్నికల్లో పిఠాపురంలో 80.92 శాతం పోలింగ్ నమోదవటంతో జనసైనికులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. అంతేకాదు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని అంటున్నారు. ఈ క్రమంలో కొందరు జనసైనికులు ముద్రగడ పద్మనాభంను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ‘ముద్రగడ పద్మనాభరెడ్డి గారి నామకరణ మహోత్సవ ఆహ్వాన పత్రిక’ అంటూ ఓ పత్రికను ట్రోల్ చేస్తున్నారు. ఆ ఆహ్వానపత్రికలో.. ‘ముద్రగడ నూతన నామకరణ మహోత్సవం అంటూ కాపు సోదర సోదరీమణులందరికి ప్రత్యేక ఆహ్వానం పలికారు . 2024 జూన్ 4న సాయంత్రం ఆరు గంటల నుంచి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఈ మహోత్సవం ఉంటుందని వెల్లడించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఘన విజయం సాధించిన తర్వాత, తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని మాట ఇచ్చిన పెద్దాయన, అతని మాటపై నిలబడతారని మాకు నమ్మకం ఉందంటూ చురక అంటించారు. ఈ మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ చివరి గమనికలో మీ ఉప్మాకాఫీలు మీరే తెచ్చుకోవాలండి’అంటూ సెటైర్లు పేల్చారు. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.