తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన తుమ్మల నాగేశ్వరరావు మరోసారి స్పందించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ… తుమ్మ ముళ్లు కావాలా? పువ్వాడ పువ్వులు కావాలా? అంటూ తుమ్మలకు చురకలు అంటించారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పాటు తుమ్మల తానూ గెలిచారు. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘తుమ్మ ముళ్లు బాగా గుచ్చుకున్నట్లేగా మీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడికి..’ అని ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు.