బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలతో హైదరాబాద్ తెలంగాణ భవన్ లో కీలక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన బీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో ఓటమికి దారి తీసిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఓడిపోయిన నియోజకవర్గాల్లోని పరిస్థితులపై సమీక్షతో పాటు భవిష్యత్ కార్యక్రమంపై నేతల అభిప్రాయాలను కేటీఆర్ తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో తాము 39 స్థానాలు గెలవడం ద్వారా గౌరవప్రదమైన స్థానంలోనే ఉన్నామని భావిస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో బాధ్యతాయుత విపక్షంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ భవన్ కేంద్రంగా అందరికీ అందుబాటులో ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. 

కాగా, ఈ సమావేశానికి మాజీ మంత్రులు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తదితరులు కూడా హాజరయ్యారు.