తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు 44 రోజుల నుంచి జైల్లో ఉన్నప్పటికీ, టాలీవుడ్ ప్రముఖుల్లో చలనం రాకపోవడం బాధాకరమని నిర్మాత నట్టి కుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఇటీవల కూడా ఇండస్ట్రీలో చంద్రబాబు వల్ల ప్రయోజనం పొందినవాళ్లు, ఆయనతో అనుబంధం ఉన్నవాళ్లు, ఆయన బంధువులు స్పందించాలని కోరానే తప్ప, ఇండస్ట్రీ మొత్తం స్పందించాలని తాను అనలేదని నట్టికుమార్ స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమలో కొందరు టీడీపీని అభిమానించవచ్చు, కొందరు వైసీపీని అభిమానించవచ్చని, ఇందులో ఎవరి స్వేచ్ఛను తాను ప్రశ్నించబోవడంలేదని అన్నారు. ఇక, జూనియర్ ఎన్టీఆర్ తన మేనత్త కుటుంబం ఇబ్బందుల్లో పడినప్పుడు స్పందించకపోవడం సరికాదని నట్టి కుమార్ అన్నారు. చంద్రబాబు అరెస్ట్ పై జూనియర్ ఎన్టీఆర్ కనీసం ట్విట్టర్ లోనైనా స్పందించి ఉంటే బాగుండేదని, ఇప్పటికైనా ఆయన చంద్రబాబు విషయంలో పునరాలోచించుకోవాలని సూచించారు. 

చిత్ర పరిశ్రమలో చంద్రబాబును అభిమానించేవాళ్లు ఆయన అరెస్ట్ ను ఖండిస్తూ, కొవ్వొత్తులు వెలిగించడమో, లేక మరేదైనా కార్యక్రమమో చేపడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు.