నిజామాబాద్, జూబ్లీహిల్స్ లేదా ఎల్లారెడ్డి నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఖండించారు. తాను కామారెడ్డి నుంచే బరిలో దిగబోతున్నానంటూ ఆయన స్పష్టత ఇచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులు ఈ దుష్ప్రచారం చేస్తున్నాయని, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కనుసన్నల్లో ఈ  ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. కామారెడ్డి నుంచే బరిలోకి దిగబోతున్నట్టు కేసీఆర్‌ ప్రకటించిన రోజే తాను చెప్పానని ప్రస్తావించారు. తన పుట్టుక, చావు అంతా కామారెడ్డేనని వ్యాఖ్యానించారు. ప్రజాక్షేత్రంలో కేసీఆర్‌తోనే తేల్చుకోబోతున్నట్టు చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక వీడియో విడుదల చేశారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. నియోజకవర్గం మారతావా? అని గతంలో అడిగినప్పుడు కూడా తాను మారలేదని షబ్బీర్ అలీ గుర్తుచేశారు. గజ్వేల్ నియోజకవర్గమే సమస్తమని గతంలో చెప్పిన సీఎం కేసీఆర్‌ కామారెడ్డి నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారో ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజకీయ కుట్రలు, కుతంత్రాలు తనకు తెలియవని షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. తాను నిజాయతీగా రాజకీయాలు చేశానని పేర్కొన్నారు. ఇక విజయదశమి రోజు ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.