ప్రముఖ బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పాడే గుండె పోటుకు గురయ్యారు. నిన్న సాయంత్రం హార్ట్‌ఎటాక్ రావడంతో ఆయనను ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ రాత్రే శ్రేయాస్‌కు యాంజియోప్లాస్టీ జరిగింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ ప్రొసీజర్ విజయవంతంగా జరిగిందని వైద్యులు పేర్కొన్నారు. ‘వెల్‌కమ్ టూ ది జంగల్’ షూటింగ్‌ అనంతరం శ్రేయాస్ గుండెపోటుతో కుప్పకూలినట్టు తెలుస్తోంది. 

హిందీ, మరాఠీ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న శ్రేయాస్ తల్పాడే అనేక హిట్ చిత్రాల్లో నటించారు. 2005 నాటి ఇక్బాల్ సినిమాలో దివ్యాంగుడి పాత్రతో ఆయనకు దేశవ్యాప్త గుర్తింపు వచ్చింది. మరాఠీ టీవీ షోలతో మొదట్లో గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఆ తరువాత ఇక్బాల్‌తో దేశం దృష్టిని ఆకర్షించారు. ఓం శాంతి ఓం, గోల్‌మాల్ రిటర్న్స్, హౌస్‌ఫుల్ 2 వంటి హిట్ చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించారు. క్రిటిక్స్‌ను మెప్పించిన డోర్ సినిమాలో తన నటనతో శ్రేయాస్ మంచి మార్కులు పొందారు. ఈ ఏడు పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ పుష్ప హిందీ వర్షన్‌లో అల్లు అర్జున్ పాత్రకు శ్రేయస్ డబ్బింగ్ చెప్పారు.