తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు తమ పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పదేళ్ల కాలంలో పేదల కోసం ఎన్నో పథకాలు తీసుకు వచ్చారని కితాబిచ్చారు. ముఖ్యమంత్రి విడుదల చేసిన బీఆర్ఎస్ మేనిఫెస్టో అద్భుతంగా ఉందని, ఆయన హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అవుతారన్నారు.

తెలంగాణలో బీఆర్ఎస్-మజ్లిస్ దోస్తీ మొదటి నుంచీ కొనసాగుతోంది. మజ్లిస్ తమ మిత్రపక్షమని కేసీఆర్ పలుమార్లు చెప్పారు. అసదుద్దీన్ ఇటీవల కూడా మాట్లాడుతూ… రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సుఖశాంతుల కోసం కేసీఆర్‌ను మళ్లీ గెలిపించాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందే అన్నారు. తాము తెలంగాణతో పాటు రాజస్థాన్ ఎన్నికల్లోను పలు స్థానాల్లో పోటీ చేస్తామని తెలిపారు.