మనసులో ఉన్నది ఏదైనా డేరింగ్‌గా బయటకు చెప్పే నటీమణుల్లో తాప్సీ కూడా ఒకరు. ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన సరదా వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న తాప్సీ సోమవారం తన అభిమానులతో ముచ్చటించారు. ట్విట్టర్ వేదికగా ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ అభిమాని యథప్రకారం తాప్సీ పెళ్లి గురించి మొదలెట్టాడు. ‘‘నువ్వు పెళ్లెప్పుడు చేసుకుంటావు?’’ అంటూ సూటి ప్రశ్న వేశాడు. ఆ అభిమాని ప్రశ్నకు తాప్సీ తనదైనీ ఫన్నీ స్టైల్‌లో సమాధానం ఇచ్చింది. ‘‘సో.. నా పెళ్లి ఎప్పుడు అని అంటారా? ప్రస్తుతమైతే నేను ప్రెగ్నెంట్ కాదు. కాబట్టి.. ఇప్పుడప్పుడే పెళ్లి లేనట్టే’’ అంటూ టక్కున సమాధానమిచ్చిన తాప్సీ ఆపై పడీపడి నవ్వింది. నెటిజన్లు కూడా తాప్సీ హాస్య చతురతకు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. తాప్సీ కొన్నేళ్లుగా బాడ్మింటన్ కోచ్ మథాయస్ బోయీతో రిలేషన్‌షిప్‌లో ఉంది. ఖాళీగా ఉన్నప్పుడల్లా ఆమె తన బాయ్‌ఫ్రెండ్, ఆయన సోదరితో కలిసి హాలీడేకు వెళ్లిపోతుంటుంది. సుదీర్ఘ హాలీడే ట్రిప్‌ను ఇటీవలే ముగించుకుని వచ్చిన తాప్సీ ఈ మధ్య తాను హాలీడేల్లోనే ఎక్కువగా గడిపేస్తున్నానని వ్యాఖ్యానించింది. తదుపరి ట్రిప్‌లో క్రాబీ ద్వీపానికి వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు కూడా చెప్పుకొచ్చింది.