మెగాస్టార్ చిరంజీవిపై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తాను చేసిన ‘పకోడిగాళ్లు’ విమర్శలపై స్పష్టత నిచ్చారు. తాను చిరంజీవిని విమర్శించినట్లు నిరూపించాలని సవాల్ చేశారు. తాను శ్రీరామ అన్నా సరే టీడీపీ, జనసేనకు బూతులుగానే వినపడతాయని ఎద్దేవా చేశారు. గుడివాడలో జరిగిన మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే వేడుకలకు మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఏం మాట్లాడానో.. చిరంజీవి, ఆయన అభిమానులకు తెలుసని చెప్పారు. తామంతా క్లారిటీగానే ఉన్నామని చెప్పుకొచ్చారు. రాజకీయంగా చిరంజీవిని విమర్శిస్తే ఏం జరుగుతుందో తనకు తెలుసని అన్నారు. 

ఎవరి జోలికీ వెళ్లని పెద్దాయన చిరంజీవిని విమర్శించేంత సంస్కారహీనుడిని కాదని చెప్పారు. ‘‘చిరంజీవి అభిమానుల ముసుగులో టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులు గుడివాడ రోడ్లపై దొర్లాయి. చిరంజీవికి, మాకు మధ్య గ్యాప్ సృష్టించాలని టీడీపీ, జనసేన ప్రయత్నం చేశాయి” అని ఆరోపించారు. 

‘‘పెద్దాయనగా చిరంజీవి చెప్పే సూచనలు పాటిస్తాం. మాకు ఇచ్చినట్లే డ్యాన్సులు, నటన చేతకాని ఇండస్ట్రీలోని పకోడీగాళ్లకు కూడా చిరంజీవి సలహాలు ఇవ్వాలనే నేను చెప్పాను. ఇండస్ట్రీలో శిఖరాగ్రాన ఉన్న చిరంజీవికి డ్యాన్సులు, యాక్షన్ రావా? నేను ఆయన గురించి మాట్లాడినట్లు ఎలా అవుతుంది?” అని ప్రశ్నించారు. తన వెంట ఉన్న వారిలో 60 శాతం మంది చిరంజీవి అభిమానులేనని చెప్పారు.