తనకు స్టేషన్ ఘన్‌పూర్ టిక్కెట్ రాకపోవడంతో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కంటతడి పెట్టారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ క్రమంలో వారితో మాట్లాడుతూ ఒక్కసారిగా భోరున విలపించారు. ఆతర్వాత కార్యకర్తలతో కలిసి అంబేడ్కర్ విగ్రహం ముందు పడుకొని వెక్కివెక్కి ఏడ్చారు. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యకు ఈసారి టిక్కెట్ దక్కలేదు. ఈ నియోజకవర్గం నుండి రాజయ్య 2014, 2018లో బీఆర్ఎస్ నుండి గెలిచారు. అయితే ఈసారి ఈ టిక్కెట్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి దక్కింది. తనకు టిక్కెట్ దక్కకపోవడంతో రాజయ్య కన్నీటిపర్యంతమయ్యారు. కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ… ఉన్నతస్థానం కల్పిస్తామని కేసీఆర్ తనకు చెప్పారన్నారు. ఇప్పుడు ఉన్న స్థానం కంటే మంచిస్థానం తనకు కల్పిస్తానని హామీ ఇచ్చారని, అధినేత మాటను గౌరవించి తాను ముందుకు సాగుతానన్నారు. కేసీఆర్ గీసిన గీతను తాను దాటేది లేదని, ఆయన ఆదేశాలు పాటిస్తానని స్పష్టం చేశారు.