తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు లేదా ఎల్లుండి మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉన్నట్లుగా జోరుగా వార్తలు వస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఖాళీ అయిన ఈటల రాజేందర్ స్థానంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని కేబినెట్లోకి తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ రోజు రాత్రికి పుదుచ్చేరి నుండి హైదరాబాద్ రానున్నారు. ఆ తర్వాత మంత్రిగా మహేందర్ రెడ్డి ప్రమాణం ఉంటుందని తెలుస్తోంది. నేడు బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన, ఎన్నికలకు మరో మూడు నాలుగు నెలలు మాత్రమే ఉన్న సమయంలో కేబినెట్ విస్తరణ ఆసక్తికరంగా మారింది.ఇందుకు సంబంధించి మహేందర్ రెడ్డి మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ… ఈ రోజు మధ్యాహ్నం గవర్నర్‌తో కేసీఆర్ మాట్లాడినట్లు చెప్పారు. కేటీఆర్ అన్నీ సెట్ చేసి వెళ్లారన్నారు. ఎల్లుండి రాజ్ భవన్‌లో ప్రమాణ స్వీకారం ఉంటుందని చెబుతూనే, గవర్నర్ వచ్చే వరకు మాత్రం తాను ఏమీ మాట్లాడనని చెప్పారు.