pawan kalyan

ఇకపై మంగళగిరి కేంద్రంగానే జనసేన ఆపరేషన్స్‌ జరగనున్నాయి. పూర్తిస్థాయి కార్యకలాపాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు నేతలు. ఇప్పటికే అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌ ప్రారంభించారు పవన్‌. ఇప్పటివరకూ ఒక లెక్క-ఇప్పట్నుంచి మరో లెక్క అన్నట్టుగా ఇకపై మంగళగిరిలోనే ఉండబోతున్నారు‌. పవన్‌ ఒక్కరే కాదు, జనసేన ఆపరేషన్స్‌ అన్నీ మంగళగిరి నుంచే జరగనున్నాయ్‌. ఇప్పటివరకు హైదరాబాద్‌ నుంచి జరుగుతోన్న కార్యకలాపాలను కూడా మంగళగిరి నుంచే నిర్వహించాలని నిర్ణయించారు జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌.

ఇకపై జనసేన విభాగాలన్నీ మంగళగిరి పార్టీ ఆఫీస్‌ నుంచే పనిచేయనున్నాయ్‌. ఆల్రెడీ అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌ను ప్రారంభించిన పవన్‌… మరో భారీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 12వందల గజాల స్థలంలో జీ+5 భవనం కోసం భూమిపూజ చేశారు. ఎన్నికల్లోపే ఈ భవన నిర్మాణం పూర్తిచేసి ఇక్కడ్నుంచే అన్ని విభాగాలు పనిచేసేలా ప్లాన్‌ చేశారు పవన్‌.

మంగళగిరి జనసేన ఆఫీస్‌లో ప్రస్తుతం ప్రత్యేక యాగం చేస్తున్నారు పవన్‌ కల్యాణ్‌. మీడియాకి ప్రవేశం లేదంటూ గోప్యంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక ఇప్పటికే  చంద్రబాబు- పవన్ పలుసార్లు కలవడంతో.. ఈ సారి ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుని పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇటీవల ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు.. అమిత్ షాతో మంతనాలు జరిపారు. ఆ భేటీకి సంబంధించి.. వివరాలు ఏం తెలియరాలేదు. కానీ ఇటీవల ఏపీ పర్యటనకు వచ్చిన జేపీ నడ్డా, అమిత్ షా వైసీపీ సర్కార్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో వైసీపీ, జనసేనతో బీజేపీ కూడా జట్టు కడుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.