కడప జిల్లా పోట్లదుర్తిలో పెద్ద ఎత్తున ఎర్రచందనం దుంగలు పట్టుబడడం తెలిసిందే. ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ నేతృత్వంలోని పోలీసులు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై ఏపీ అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎర్రచందనం అక్రమ రవాణా వెనుక ఎవరున్నా సరే వదలొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. “ఎర్రచందనం అక్రమ రవాణా వెనుక ఉన్న పెద్ద తలకాయలను పట్టుకోండి… స్మగ్లర్లను నడిపిస్తున్న వాళ్లను పట్టుకోలేకపోతే ఎలా? శేషాచలం అడవుల్లో కొట్టేసిన దుంగలను ఎక్కడెక్కడ దాచారో తక్షణమే గుర్తించాలి. ఎర్రచందనం దుంగలు జిల్లాలు, రాష్ట్రాలు దాటిపోతున్నాయి… నిఘా వ్యవస్థలు పటిష్టపరచండి” అని పవన్ స్పష్టం చేశారు.