ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధ నౌక గద్దర్ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు అధికారిక లాంఛనాలతో నిర్వహించబోతోంది. మరోవైపు గద్దర్ కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించడాన్ని యాంటీ టెర్రరిజం ఫోరం (ఏటీఎఫ్) తప్పుపడుతోంది. గద్దర్ కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించడం ముమ్మాటికీ పోలీసు అమరవీరులను అగౌరవపరచడమేనని ఏటీఎఫ్ కన్వీనర్ రావినూతల శశిధర్ మండిపడ్డారు. నక్సలైట్ వ్యతిరేక పోరాటంలో ఎంతో మంది పోలీసులు, పౌరులు ప్రాణాలను కోల్పోయారని… ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ కు అంత్యక్రియలను నిర్వహిస్తే… వీరి త్యాగాలను అవమానించడమే అవుతుందని శశిధర్ అన్నారు. తన విప్లవ పాటలతో వేలాది మంది యువతను నక్సలైట్ ఉద్యమం వైపు మళ్లించిన వ్యక్తి గద్దర్ అని ఆయన చెప్పారు. వేలాది మంది పోలీసులను నక్సలైట్ ఉద్యమం బలి తీసుకుందని అన్నారు. తన సాహిత్యం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా యువత సాయుధ పోరాటం చేసేలా చేశారని… వారిని దేశ ద్రోహులుగా మలిచారని విమర్శించారు.

Previous article7-8-2023 TODAYE-PAPER
Next articleతీవ్రంగా కలచివేసింది: గద్దర్ మృతిపై మావోయిస్ట్ పార్టీ లేఖ