రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని, కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని మంత్రి హరీశ్ రావు అన్నారు. మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఈ నెల 23న సీఎం కేసీఆర్‌ మెదక్‌ జిల్లాలో పర్యటించనున్నట్లు చెప్పారు. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలతో పాటు బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారన్నారు. కొన్ని రాష్ట్రాల అధికారులు, మంత్రులు వచ్చి సమీకృత కలెక్టరేట్‌ను పరిశీలించారన్నారు. అన్ని కార్యాలయాలు ఒకేచోట ఉండడంతో వివిధ సమస్యలు పరిష్కరించుకోవచ్చునని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాయన్నారు. కేసీఆర్ మూడోసారి సీఎం కావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీకి లీడర్లు లేరని, బీజేపీకి క్యాడర్ లేదని ఎద్దేవా చేశారు. కానీ తమ పార్టీకి తిరుగులేదన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పాలనను ప్రజలు గమనిస్తున్నారన్నారు. తాము 24 గంటల విద్యుత్ అంటే నమ్మలేదని, కానీ ఇచ్చి చూపించామన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కేసీఆర్‌ను తిట్టడంలో బిజీగా ఉంటే కేసీఆర్ వడ్లు పండించడంలో బిజీగా ఉన్నారన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాకే మెదక్ జిల్లా కల నెరవేరిందన్నారు. రూ.1 లక్ష లోపు రుణ ప్రకటన ద్వారా 30 లక్షల కుటుంబాలకు రుణమాఫీ జరిగిందన్నారు. ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని కేసీఆర్ ఆదేశించారన్నారు. త్వరలో రూ.1 లక్షకు పైగా ఉన్న వారికి రుణమాఫీ చేస్తామన్నారు. బీఆర్ఎస్ పథకాలను చూసి కాంగ్రెస్ బేజారవుతోందన్నారు. మైనార్టీల సంక్షేమానికి, బీసీ కులవృత్తులకు మద్దతుగా నిలిచామన్నారు.