ఎన్నికల్లో గెలిచి 31 నెలలు పూర్తయినా ఇప్పటికీ ఎన్నికల హామీలను నెరవేర్చలేక పోయానంటూ ఓ కౌన్సిలర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ మీటింగ్ లో చెప్పుతో కొట్టుకున్నారు.. ప్రజల కనీస అవసరాలు తీర్చలేకపోతున్నందుకు ఈ సభలోనే చనిపోవాలని అనిపిస్తోందంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని నర్సీపట్నం మున్సిపాలిటీలో సోమవారం నాటు చోటుచేసుకుంది.

తెలుగుదేశం పార్టీ నుంచి ములపర్థి రామరాజు నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని లింగాపురం గ్రామం నుంచి కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. ఎన్నికల సందర్భంగా తన వార్డు పరిధిలో పలు అభివృద్ధి పనులు చేపడతానని, కనీస సదుపాయలను కల్పిస్తానని ప్రజలకు హామీ ఇచ్చినట్లు రామరాజు చెప్పారు. కౌన్సిలర్ గా గెలిచి ఇప్పటికి 31 నెలలు పూర్తవుతోందని, తన వార్డు సమస్యలను పరిష్కరించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించినా విఫలమయ్యానని వివరించారు.

సివిక్ బాడీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తన వార్డు ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదని వాపోయారు. కౌన్సిలర్ గా ఉండి కూడా ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.