బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బీసీ ఆత్మగౌరవ సభపై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు మంగళవారం స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రధాని నరేంద్రమోదీకి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీలు గుర్తుకు వచ్చారా? అని ప్రశ్నించారు. బీసీల కోసం చేసింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. ఓబీసీ కులగణన చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారన్నారు. ఇలాంటి సమయంలో మోదీకి బీసీల ఆత్మగౌరవం గుర్తుకు వచ్చిందా? అన్నారు. ఐఐటీ, ఐఐఎంలలో రిజర్వేషన్లు కావాలని కోర్టుకు వెళ్తే… అవకాశం లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కావాలని అడిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు నరేంద్ర మోదీ పక్కన చేరారని విమర్శించారు. పవన్ కల్యాణ్‌ను బీజేపీ వాళ్ళు వాడుకుంటున్నారని ఆరోపించారు. బీసీల గురించి చెబుతున్న పవన్ కళ్యాణ్ కాపు వ్యక్తి అన్నారు. ప్రయివేటు పరిశ్రమలలో రిజర్వేషన్స్ ఎందుకు అడగలేదో చెప్పాలన్నారు. మోదీ ఓబీసీలకు చేస్తున్న మోసాన్ని అందరూ గమనించాలన్నారు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసేది ఒక కాంగ్రెస్ పార్టీయే అన్నారు.