ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని… మీరు చెప్పి ఇప్పించాలని, లేదంటే మీ వద్ద ప్లేట్లు కడిగే ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ కొంతమంది నిరుద్యోగులు… కుమారి ఆంటీకి మొరపెట్టుకున్నారు. హైదరాబాదు మాదాపూర్ లో రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్న కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ను ఇటీవల ట్రాఫిక్ పోలీసులు మూసివేయించడం.. ఆ వార్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళడంతో ఆయన ఆమెకు అండగా నిలుస్తూ.. ఆమె ఫుడ్ స్టాల్ ను నిర్వహించుకునేలా ఆదేశాలు ఇవ్వడం విదితమే. దీంతో ఆమె మరింత పాప్యులర్ అయ్యారు. ఈ నేపథ్యంలో కుమారి ఆంటీ వద్దకు ఈ రోజు పలువురు నిరుద్యోగులు వచ్చి, తమ గురించి ముఖ్యమంత్రికి చెప్పమంటూ ఆమెను ఇబ్బంది పెట్టారు. అయితే తనకు ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు తెలియవని… తాను రోడ్డు పక్కన ఫుడ్డు అమ్ముకునే వ్యక్తిని అని.. తన సమస్యపై ముఖ్యమంత్రి స్పందించారని గుర్తు చేశారు. ఆయన ప్రజానాయకుడని, అందరి సమస్యలను పరిష్కరిస్తారని వారికి ధైర్యం చెప్పారు. తమకు ప్రభుత్వం అన్యాయం చేసినందునే మీ వద్దకు వచ్చామని నిరుద్యోగులు పదేపదే ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఆమె ‘నాన్నా… నాన్నా నేను చెప్పేది వినండి’ అంటూ ఆమె ఓపికగా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు.