మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్‌వేర్ యువతి మృతి

PJNews | మాదాపూర్: స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళ్తున్న ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైటెక్ సిటీ చిన్న పెద్దమ్మ ఆలయం సమీపంలో ఉన్న సీఐఐ జంక్షన్ వద్ద బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కొండాపూర్‌లోని ఓ పీజీ హాస్టల్‌లో నివాసముంటున్న సుష్మా చౌదరి (28) సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆమె స్నేహితుడు కొతిలి అక్షయ్ కుమార్ (28) కాజాగూడలోని ఓ ప్రైవేట్ సంస్థలో ప్రొడక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.
మంగళవారం అర్ధరాత్రి ఇద్దరూ మాదాపూర్‌లోని తమ స్నేహితుడు ఉల్లూరి సందీప్ నివాసానికి వెళ్లి భోజనం చేశారు. అనంతరం బుధవారం తెల్లవారుజామున 12.50 గంటల సమయంలో అక్షయ్ కుమార్ తన బుల్లెట్ మోటార్ సైకిల్‌పై సుష్మా చౌదరిని ఎక్కించుకొని కొండాపూర్ వైపు బయలుదేరారు.
బ్రేకింగ్ న్యూస్, ముఖ్యమైన వార్తలను నేరుగా పొందండి.
డివైడర్‌ను ఢీకొట్టి చెట్టును ఢీకొన్న బైక్
తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో సీఐఐ జంక్షన్ సమీపానికి చేరుకోగానే అక్షయ్ కుమార్ నిర్లక్ష్యంగా వాహనం నడపడంతో అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను, అనంతరం డివైడర్ మధ్యలో ఉన్న చెట్టును ఢీకొన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న సుష్మా చౌదరి కిందపడిపోయారు. ఆమె తలకు, ముఖానికి తీవ్ర గాయాలై రక్తస్రావమైంది. అక్కడున్న వారి సహాయంతో వెంటనే మాదాపూర్‌లోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. అయితే తెల్లవారుజామున 1.25 గంటలకు ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటనపై ఉల్లూరి సందీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, వాహనాన్ని నడిపిన తీరు తదితర అంశాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది.
తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ మీ వాట్సాప్‌లో పొందండి.

ఇప్పుడే చేరండి










