రెండు నియోజకవర్గాలుగా కుత్బుల్లాపూర్.. బాచుపల్లికి అవకాశం?

- నియోజకవర్గాల పునర్విభజనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ
- కుత్బుల్లాపూర్‌లో సుమారు 16 లక్షల జనాభా ఉన్నట్లు అంచనా
- సర్ ప్రక్రియకు ముందు 7.47 లక్షల మంది ఓటర్లు
- బాచుపల్లి కేంద్రంగా కొత్త అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశం
- ఆరు సర్కిళ్లు, 24 డివిజన్ల పరిధిలో కుత్బుల్లాపూర్
PJNews | కుత్బుల్లాపూర్: అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అంశం తెరపైకి రావడంతో కుత్బుల్లాపూర్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. జనాభా, ఓటర్ల సంఖ్య భారీగా పెరగడంతో ప్రస్తుతం ఉన్న కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం రెండు నియోజకవర్గాలుగా విడిపోయే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాచుపల్లి కేంద్రంగా మరో అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడవచ్చన్న ప్రచారం జరుగుతోంది.
16 లక్షలకు చేరిన జనాభా?
2011 జనాభా లెక్కల ప్రకారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 3,89,294 మంది జనాభా ఉన్నారు. పారిశ్రామికంగా, స్థిరాస్తి వ్యాపారపరంగా ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందడంతో వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి స్థిరపడ్డారు. ప్రస్తుతం జనాభా సుమారు 16 లక్షలకు చేరినట్లు స్థానిక అంచనాలు చెబుతున్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియకు ముందు నియోజకవర్గంలో 7.47 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు సమాచారం.
బ్రేకింగ్ న్యూస్, ముఖ్యమైన వార్తలను నేరుగా పొందండి.
ఆరు సర్కిళ్లు.. 24 డివిజన్లు
కుత్బుల్లాపూర్, దుండిగల్, బాచుపల్లి రెవెన్యూ మండలాలతో పాటు జీడిమెట్ల, చింతల్, గాజులరామారం, నిజాంపేట, దుండిగల్, కొంపల్లి సర్కిళ్లు ఈ ప్రాంత పరిధిలో ఉన్నాయి. సుమారు 2,500 పరిశ్రమలు ఉండటంతో ఉపాధి అవకాశాలు పెరిగాయి. దీనికి తోడు భారీగా నివాస సముదాయాలు ఏర్పడటంతో జనాభా గణనీయంగా పెరిగింది.
బాచుపల్లికి ప్రత్యేక నియోజకవర్గం?
గతంలో మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో భాగంగా ఉన్న కుత్బుల్లాపూర్ 2008 నియోజకవర్గాల పునర్విభజనతో ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పడింది. తాజాగా మరోసారి పునర్విభజన అంశం చర్చకు రావడంతో బాచుపల్లి కేంద్రంగా కొత్త నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశాలపై రాజకీయ వర్గాలు దృష్టి సారించాయి.
నియోజకవర్గం రెండుగా విడిపోతే స్థానిక రాజకీయ సమీకరణాలతో పాటు ప్రజాప్రాతినిధ్యంలోనూ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఏయే ప్రాంతాలు కొత్త నియోజకవర్గంలోకి వెళ్తాయి? ప్రస్తుతం ఉన్న నియోజకవర్గ సరిహద్దులు ఎలా మారతాయి? అన్న అంశాలపై స్థానికంగా చర్చ జరుగుతోంది.
అయితే కుత్బుల్లాపూర్ విభజనకు సంబంధించి ఇప్పటివరకు అందిన సమాచారంలో అధికారిక ప్రకటన లేదు. పునర్విభజనకు సంబంధించిన విధివిధానాలు, అధికారిక ప్రతిపాదనలు వెల్లడైన తర్వాతే దీనిపై స్పష్టత రానుంది.
తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ మీ వాట్సాప్‌లో పొందండి.


ఇప్పుడే చేరండి










