కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక, రాజయ్య వంటి వారు ఎమ్మెల్యేలు అయ్యాక అడబిడ్డలు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ తీసుకువచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. స్టేషన్ ఘనపూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి యాత్ర సభలో టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ… ఎమ్మెల్యే రాజయ్య లేదా బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి మహిళలకు గౌరవం ఇవ్వాలని సూచించారు. వీరిద్దరి గురించి మనం పెద్దగా చెప్పవలసిన పని లేదన్నారు. శ్రీహరి గురించి రాజయ్య, రాజయ్య గురించి శ్రీహరి చెప్పారన్నారు. అయితే వీళ్లిద్దరికీ ఓ సారూప్యత ఉందని, వీరిద్దరూ ఉపముఖ్యమంత్రులుగా పని చేసి ఉద్యోగం ఊడగొట్టుకున్నారన్నారు. వీరి గురించి కేసీఆర్‌కు తెలుసు కాబట్టే ఉద్యోగం ఊడగొట్టారన్నారు. ఇలాంటి వారిని ఎమ్మెల్యేలుగా ఎన్నుకుందామా? అన్నారు.

కడియం శ్రీహరి విద్యాశాఖ మంత్రిగా పని చేసి ఇక్కడకు డిగ్రీ కాలేజీ తీసుకు రాలేదని, రాజయ్య వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారని, కానీ వంద పడకల ఆసుపత్రి తీసుకు రాలేదన్నారు. ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి ఇందిరను గెలిపిస్తే స్టేషన్ ఘనపూర్‌కు వంద పడకల ఆసుపత్రి, డిగ్రీ కాలేజీ ఇప్పిస్తానని, ఇందుకు తనది గ్యారంటీ అన్నారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావు, రాజయ్య, కడియం శ్రీహరి ఈ రోజు పిచ్చికుక్కల్లా సందుసందుకు తీరుగుతున్నారన్నారు. ఈ పదేళ్లలో వారు సరిగ్గా పాలన అందిస్తే, ఇచ్చిన హామీలు అమలు చేస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేదా? అన్నారు. కేసీఆర్ కేబినెట్లో మాదిగ సామాజిక వర్గానికి, మహిళలకు సరైన ప్రాధాన్యత లేదని మండిపడ్డారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో నలుగురు మహిళా మంత్రులు ఉంటారన్నారు.

Previous articleప్రభుత్వ అవినీతిని ఆధారాలతో సహా నిరూపిస్తున్నామన్న నాదెండ్ల
Next articleకాంగ్రెస్ అంటే ఏమిటో వివిధ రాష్ట్రాల్లో గెలిచి చూపించామన్న దినేశ్