విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లో ఈ ఉదయం చోటుచేసుకున్న బస్సు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడం అందరినీ కలచివేస్తోంది. ఈ ఘటనపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడుతూ… రాష్ట్రంలోనే అతిపెద్ద బస్టాండులో ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ కు ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు వస్తుంటారని… అలాంటి చోట జరిగిన ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని చెప్పారు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే ఆర్థిక సాయాన్ని అందజేయాలని కోరారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.