తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీ కొన్ని స్థానాల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ పొత్తు సర్దుబాటులో భాగంగా 9 స్థానాలను జనసేనకు కేటాయించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మొగలి రేకులు టీవీ సీరియల్ తో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు సాగర్ జనసేన పార్టీలో చేరారు. ఇవాళ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్… సాగర్ కు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. సాగర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం జనసేన అభ్యర్థిగా బరిలో దిగే అవకాశాలున్నాయి. సాగర్ రామగుండం నియోజకవర్గానికి చెందినవాడే. మరి బీజేపీ రామగుండం స్థానాన్ని జనసేనకు కేటాయిస్తుందో, లేదో తెలియాల్సి ఉంది. ఇవాళ సాగర్ మాత్రమే కాదు… హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, కొత్తగూడెం జిల్లాకు చెందిన వ్యాపారవేత్త లక్కినేని సురేందర్ రావు, అదే జిల్లాకు చెందిన ముయ్యబోయిన ఉమాదేవి, ఆమె భర్త నాగబాబు కూడా జనసేనలో చేరారు.  జనసేన పార్టీలో చేరిన సందర్భంగా సాగర్ మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ నాయకత్వం, ఆయన ప్రజా పోరాటాలు తనను విశేషంగా ఆకర్షించాయని తెలిపారు. పార్టీలో ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో నెరవేరుస్తానని పేర్కొన్నారు.