అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు, ఆర్ఆర్ఆర్ కు అనేక కేటగిరీల్లో పురస్కారాలు, ఉప్పెన చిత్రానికి జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు… ఇలా జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు అవార్డుల పంట పండడంతో టాలీవుడ్ లో పండుగ వాతావరణం నెలకొంది. అవార్డు విజేతలకు ఇతర నటీనటులు, టెక్నీషియన్లు శుభాకాంక్షలు చెబుతున్న నేపథ్యంలో, చిత్ర పరిశ్రమలో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. ఇక, అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం దక్కడంపై ప్రముఖ నటుడు, రచయిత, ఏపీ ఎఫ్ డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి స్పందించారు. అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు రావడం తనకెంతో సంతోషం కలిగించిందని చెప్పాడు. ఇంతవరకు ఏ తెలుగు నటుడు సాధించలేనిది అల్లు అర్జున్ సాధించాడని ప్రశంసించారు. అల్లు అర్జున్ ఓ స్టార్ అయినప్పటికీ, ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉంటాడని పోసాని కితాబునిచ్చారు. అల్లు అర్జున్ నిత్య విద్యార్థి అని, అదే అతడిలో ఉండే గొప్ప లక్షణం అని కొనియాడారు. భవిష్యత్తులో అల్లు అర్జున్ ఇంకా ఎదుగుతాడని, కచ్చితంగా ఆస్కార్ సాధిస్తాడని పేర్కొన్నారు. అల్లు అర్జున్ అంటే తనకెంతో ఇష్టమని, అలాగే, అల్లు అర్జున్ కు కూడా తానంటే ఇష్టమని పోసాని చెప్పుకొచ్చారు