అరెస్టయిన చంద్రబాబును కలిసేందుకు ఏపీకి వచ్చిన జనసేనాని పవన్ కల్యాణ్ ను పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. జగ్గయ్యపేట మండలంలో పలుమార్లు తనను అడ్డుకోవడంతో పవన్ కల్యాణ్ అనుమంచిపల్లి నుంచి కాలినడకన మంగళగిరి బయల్దేరారు. అయినప్పటికీ పోలీసులు అభ్యంతరం చెప్పడంతో అక్కడే రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో, పోలీసులు పవన్ కల్యాణ్ ను, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను అదుపులోకి తీసుకుని అక్కడ్నించి తరలించారు. అయితే, తమ పార్టీ అగ్రనాయకులను ఎక్కడికి తరలిస్తున్నారో తెలియకపోవడంతో జనసేన శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి. ఈ దశలో జనసైనికులు, వీరమహిళలు పవన్ ను తీసుకెళుతున్న వాహనం వెంట రక్షణ కవచంలా అనుసరించారు. కాసేపటి తర్వాత పోలీసులు పవన్, నాదెండ్లను మంగళగిరిలోని జనసేన కార్యాలయం వద్ద విడిచిపెట్టారు. అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్న జనసేన కార్యకర్తలు నినాదాలు చేస్తూ హోరెత్తించారు. అంతకుముందు, పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, బెయిల్ మీద ఉన్న సీఎం జగన్ ఎప్పుడూ జైలు గురించే ఆలోచిస్తారని విమర్శించారు. ఓ నేరగాడి చేతిలో అధికారం ఉండడం బాధాకరమని, చంద్రబాబును అరెస్ట్ చేస్తారని తాను ఊహించలేదని తెలిపారు. వారాహి యాత్ర తదుపరి షెడ్యూల్ నిర్ణయించేందుకు ఆదివారం నాడు మంగళగిరిలో సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు.