కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన 13 మంది వలస కూలీలు దుర్మరణం చెందడం తెలిసిందే. వారు ప్రయాణిస్తున్న టాటా సుమో వాహనం ఆగివున్న ట్యాంకర్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ రోడ్డు ప్రమాదంపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.  కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్లాపూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మన రాష్ట్రానికి చెందిన 13 మంది వలస కూలీలు దుర్మరణం పాలవడం ఆవేదన కలిగించిందని తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లా గోరంట్ల ప్రాంతానికి చెందిన వీరంతా ఉపాధి కోసం కర్ణాటక వెళుతుండగా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తమ ప్రాంతంలోనే వారికి ఉపాధి అవకాశాలు లభించి ఉంటే పొరుగు రాష్ట్రాలకు వలసపోయే అవసరం ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. పేద కుటుంబాలకు చెందిన వీరిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, తగినంత నష్ట పరిహారం అందించాలని పవన్ కల్యాణ్ కోరారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వ అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు.