మీడియా సభ్యులను ఉద్దేశించి ‘స్నాక్స్‌ను భోజనంలా తింటున్నారు’ అంటూ ‘ఆదికేశవ’ మూవీలోని ‘లీలమ్మో’ సాంగ్ విడుదల వేదికపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు యాంకర్ సుమ క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలు మీడియా వారిని ఇబ్బంది పెట్టాయని తనకు అర్థమవుతోందని విచారం వ్యక్తం చేశారు. నిండు మనసుతో క్షమాపణ కోరుతున్నానని అన్నారు. మీడియావారు ఎంత కష్టపడి పనిచేస్తారో తనకు తెలుసునన్నారు. ‘ మీరు, నేను కలిసి కొన్నేళ్ల నుంచి ప్రయాణిస్తున్నాం. నన్ను ఓ కుటుంబ సభ్యురాలిగా భావించి క్షమిస్తారని ఆశిస్తున్నా’ అని తెలియజేస్తూ యాంకర్ సుమ ఒక వీడియో విడుదల చేశారు.

కాగా బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన ‘లీలమ్మో’ పాట విడుదల వేదికపై కూడా సుమ క్షమాపణలు కోరారు. ఈ ఈవెంట్‌కి యాంకర్‌గా వ్యవహరించిన సుమ ఓ సందర్భంలో ‘మీడియావారు స్నాక్స్‌ను భోజనంలా తింటున్నారు’ అని ఆమె అన్నారు. అక్కడే ఉన్న ఓ మీడియా ప్రతినిధి ఈ వ్యాఖ్యలను ఖండించారు. అలా అనొద్దని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో చాలాకాలంగా ఉన్న చనువుతోనే ఈ వ్యాఖ్యలు చేశానని, క్షమించాలని అదే వేదికపై ఆమె కోరిన విషయం తెలిసిందే.